హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం మేనకోడలు షాహెదా సాజిద్ ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేశరాజుపల్లి వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అతి వేగంగా కారు నడపడం వల్లే ఆమె మృతి చెందినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

also read:టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన షాహెదా సాజిద్ తన భర్త ఫహీం, ఇద్దరు కుమార్తెలతో కలిసి హైద్రాబాద్ లో నివాసం ఉంటుంది. ఆదివారం నాడు తన బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హజరయ్యేందుకు నల్గొండకు వచ్చింది. ఆ తర్వాత ఆమె తన బాబాయ్ కారును తీసుకొని మిర్యాలగూడకు ఒంటరిగా బయలుదేరింది.

కేశరాజుపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ఆమె కారు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె నడుపుతున్న కారు 120 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తోంది.షాహెదా, ఆమె భర్త ఫహీంపై గ్యాంగ్‌స్టర్‌ నయీంకు సంబంధించిన కేసులు ఉన్నాయి. షాహెదా పేరిట  వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. షాహెదాపై బలవంతపు వసూళ్లు, భూ ఆక్రమణల కేసులు ఉన్నాయి. 

ఆమెపై భువనగిరి పట్టణంలో రెండు భూకబ్జా కేసులు, గజ్వేల్‌లో జంటహత్యల కేసు ఉన్నాయి. షాహెదా మైనర్‌గా ఉన్నప్పటినుంచే నయీం గ్యాంగ్‌లో కీలక సభ్యురాలిగా పనిచేసేది. 

షాహెదా మిర్యాలగూడకు ఎందుకు ఒంటరిగా వెళ్లింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిందా ఎవరైనా ఆమె మరణానికి కారణమయ్యారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.