గ్యాంగ్‌స్టర్ నయీం చెల్లి, బావను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను బెదిరించి, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసిన వ్యవహారంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నయీం అండతో అతడి సోదరి అయేషా బేగం, ఆమె భర్త మహమ్మద్ అబ్దుల్ సలీమ్ భూకబ్జాలకు పాల్పడ్డారు. 2003లో భువనగిరిలోని సర్వే నంబర్లు 65 నుంచి 70లలో ఉన్న 68 ఎకరాల భూమిని కబ్జా చేశారు.. కేసీ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆ భూమిని బలవంతంగా లాక్కొన్నారు.

ఇదే క్రమంలో 2006లో కూర శ్రీనివాస్, కూర శ్రీదేవికి చెందిన 9.6 ఎకరాలను, 2007లో లండన్ టౌన్‌షిప్‌లో 2,983 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 8 ఫ్లాట్లు, మరో కేసులో 8 ఫ్లాట్లు, ఇంకో కేసులో 8 ఫ్లాట్లు తుక్కాపురం గ్రామంలో రాసాల పద్మ అనే మహిళకు చెందిన 180 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు.

దీంతో బాధితులు అయేషా, అబ్డుల్ సలీమ్‌లపై హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తితో పాటు భువనగిరి పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.