థర్మాకోల్, ఐస్‌క్రీమ్ పుల్లలతో థర్మాకోల్‌తో అయోథ్య రామ మందిరాన్ని నిర్మించి.. అందులో వినాయకుడిని ప్రతిష్టించారు సిరిసిల్లకు చెందిన అశోక్ అనే వ్యక్తి. ఇందుకోసం దాదాపు 18 వేల వరకు ఖర్చు చేసినట్లు అశోక్ తెలిపాడు. 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వూరూ, వాడా గణపతి మండపాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. విభిన్న రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే సిరిసిల్లకు చెందిన దీకొండ అశోక్ అనే వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. థర్మాకోల్, ఐస్‌క్రీమ్ పుల్లలతో ఆయన వినాయక మండపాన్ని నిర్మించాడు. వృత్తిరీత్యా పవర్ లూమ్ జాఫర్ (మెకానిక్)గా పనిచేస్తున్న అశోక్‌కు థర్మాకోల్, ఐస్‌క్రీమ్ పుల్లలతో కళాఖండాలు రూపొందించడం అలవాటు. అలా గడిచిన నాలుగేళ్లుగా వినాయక నవరాత్రుల సమయంలో ఏదో ఒక కళాఖండం రూపొందించి అందులో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి పూచించేవాడు. 

దీనిలో భాగంగా ఈ ఏడాది థర్మాకోల్‌తో అయోథ్య రామ మందిరాన్ని నిర్మించి.. అందులో వినాయకుడిని ప్రతిష్టించారు అశోక్. రామ మందిరం నమూనాను రూపొందించడానికి అశోక్, అతని కుమారుడు దాదాపు నెల రోజులు శ్రమించారు. మూడు అంతస్తులుగా నిర్మించిన నిర్మాణంలో మొదటి అంతస్తులో 45 స్తంభాలను, రెండవ అంతస్తులో 33 స్తంభాలను, మూడో అంతస్తులో 17 స్తంభాలను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. దేవాలయంలో 15 చిన్న గోపురాలు, నాలుగు పెద్ద గోపురాలు మొత్తంగా 19 గోపురాలు నిర్మించారు. ఈ రామాలయం పొడవు 8 ఫీట్లు, వెడల్పు 5.5 ఫీట్లు ఎత్తు 7 ఫీట్లు ఉంది. ఇందుకోసం దాదాపు 18 వేల వరకు ఖర్చు చేసినట్లు అశోక్ తెలిపాడు.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా పాకడంతో రామ మందిరం మండపాన్ని చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. ఇంతకుముందు తొలి ఏడాది అసెంబ్లీ మోడల్, రెండవ ఏడాది తిరుపతి వెంకన్న దేవాలయం, మూడవ సంవత్సరం గుర్రాల రథాన్ని నిర్మించారు అశోక్. ఇప్పుడు అయోధ్య రామ మందిరంను తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. అతని పనికి, అశోక్ కుటుంబం మొత్తం చేదోడు వాదోడుగా ఉంటుంది.