తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టే.. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరానని ఆ పార్టీ నేత గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. త్వరలో రానున్న ఎన్నికలకు తమ పార్టీ తరపు అభ్యర్థుల జాబితాను కూడా కేసీఆర్ విడుదల చేశారు. జాబితాలో పేర్లు ఉన్నవారు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుండగా.. టికెట్ ఆశించి భంగపడిన వారు మాత్రం  నిరాశకు గురతున్నారు. తమ ఆవేదన మొత్తాన్ని మీడియా ముందు వెల్లగక్కుతున్నారు.

తాజాగా టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...మంత్రి కేటీఆర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌లతో చర్చించినప్పుడు టికెట్‌ ఇస్తానంటేనే టీఆర్‌ఎస్‌లో చేరానని, తీరా మోసం చేశారని వాపోయారు. మధుసూదనాచారి, రమణారెడ్డి, కీర్తిరెడ్డి వీళ్లెవరు నియోజకవర్గ వాస్తవ్యులు కాదని, తమకు ఉన్న వ్యాపారాలను కాపాడుకోవడానికి ప్రజల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ఆదివారం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని, ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని సత్యనారాయణరావు కోరారు. సమావేశంలో కామిడి రత్నాకర్‌రెడ్డి, పులి తిరుపతిరెడ్డి, గూటోజు కిష్టయ్య, చోటేమియా, బుచ్చిరెడ్డి, రాంరెడ్డి, మహేందర్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, సురేష్‌ పాల్గొన్నారు.