భూపాలపల్లి:  టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించిన తర్వాత ముఖ్య అనుచరుల సమావేశంలో  గండ్ర  వెంకటరమణారెడ్డి దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే  టీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకొన్నట్టుగా వారు ప్రకటించారు.

సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ను గండ్ర దంపతులు కలిశారు. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రకటించారు. మంగళవారం నాడు భూపాలపల్లిలో ముఖ్య అనుచరులతో గండ్ర వెంకటరమణారెడ్డి  దంపతులు భేటీ అయ్యారు.

పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయమై వారు వివరించారు. ఈ సమయంలో గండ్ర వెంకటరమణరెడ్డి సతీమణి జ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్టుగా ఆమె చెప్పారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి కోసం తాను పార్టీ మారినట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరికీ కూడ అన్యాయం జరగదని  ఆమె చెప్పారు.

తన పనితో తనపై విమర్శలు చేసిన వారికి సమాధానం  చెప్పేందుకే తాను టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా భూపాలపల్లి  ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణరెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండి అవమానాలు భరించలేకే తాను టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. మాటలు చెప్పేవారికి తన పనితో సమాధానం చెప్పాలని టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.