Asianet News TeluguAsianet News Telugu

కరోనా కేసులతో గాంధీ ఆసుపత్రి ఫుల్, కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా నిమ్స్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ స్పెషల్ ఆస్పత్రిగా కేటాయించిన గాంధీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. శుక్రవారం వరకు రోజువారీగా వందకు పైగా కేసులు వస్తుండగా.. శనివారం ఒక్కరోజే ఏకంగా 200 మంది రోగుల రావడంతో గాంధీ ఆసుపత్రిలోని పడకలన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. 

Gandhi Hospital Almost Full With Coronavirus Cases, NIMS To Be Designated As COVID Speciality Hospital
Author
Hyderabad, First Published Jun 7, 2020, 7:55 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ స్పెషల్ ఆస్పత్రిగా కేటాయించిన గాంధీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. శుక్రవారం వరకు రోజువారీగా వందకు పైగా కేసులు వస్తుండగా.. శనివారం ఒక్కరోజే ఏకంగా 200 మంది రోగుల రావడంతో గాంధీ ఆసుపత్రిలోని పడకలన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. 

మే 26వ తేదీ వరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 650. మే4 గురువారం నాటికి.. అంటే కేవలం పది రోజుల్లోనే 805 మంది పెరిగి 1,455 మంది అడ్మిట్ అయ్యారు. 

గాంధీ ఆస్పత్రిలో బెడ్లు దాదాపుగా నిండిపోగా, ఇంకా కేసులు మాత్రం భారిస్థాయిలోనే నమోదవుతూ ఉండడం, వారంతా గాంధీకే వస్తుండటం వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. 

ఆస్పత్రిలో అందుబాటులో దాదాపుగా  1,160 పడకలుండగా కేసుల తీవ్రత దృష్ట్యా వైద్య కళాశాలలో మరో 350 బెడ్లను అదనంగా అడ్జస్ట్ చేశారు. దీంతో మొత్తం పడకల సంఖ్య 1,510 కు చేరాయి. కేసుల ఉధృతి గత కొన్ని రోజులుగా పెరుగుతుండడంతో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. 

కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. 

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను కరోనా వైరస్ చికిత్స నిమిత్తం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 

సోమవారం నుంచి ఇక్కడ పడకలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకుతుండడం ఆనందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వారిని రక్షించుకోవడం తొలి ప్రాధాన్యంగా భావించిన ప్రభుత్వం వారికి అక్కడ ప్రత్యేకంగా చికిత్స అందించాలని చూస్తున్నారు.  

మిలీనియం బ్లాక్ లోని రెండు అంతస్తులను కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించనున్నట్టు తెలియవస్తుంది. ఇక్కడే వీఐపీలకు కూడా ట్రీట్మెంట్ ను అందించే ఆలోచనను చేస్తుంది సర్కార్. 

Follow Us:
Download App:
  • android
  • ios