పదే పదే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి కేటీఆర్ ను గద్వాల ఎమ్మెల్యే డీకె అరుణ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమంటూ, తమ  టీఆర్ఎస్ పార్టీ గెలుపొందకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పలు సభల్లో కేటీఆర్ వెల్లడించారని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తన మాటలకు కట్టుబడి రాజకీయ సన్యాసానికి కేటీఆర్ సిద్దంగా ఉండాలని అరుణ సూచించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన అరుణ మంత్రి కేటీఆర్ నే లక్ష్యంగా చేసుకున్నారు. హంద్రి నీవా ప్రాజెక్టుకు తాను సహకరించినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టుకు తాను మంగళహారుతులు పట్టానని మంత్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఆయన తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ అదే ప్రభుత్వంలో తన నాన్న, భావ బాగస్వాములుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆ సమయంలో తెలంగాణ కు అన్యాయం జరిగేలా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేదో వారినే ప్రశ్నించాలని ఆమె సూచించారు. అలా కాకుండా ప్రతి సారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రారంభోత్సవాలు చేసుకున్న ప్రాజెక్టులను తమ ప్రాజెక్టులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుల డిజైన్లను మార్చి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారని అన్నారు. అందుకోసమే పాలమూరు ప్రాజెక్టు కు నిధులివ్వకుండా కాళేశ్వరానికి తరలించారని డికే అరుణ మండిపడ్డారు.