గద్వాల్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ ... బీఆర్ఎస్‌లో చేరిన డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి
గద్వాల్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు . పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా డబ్బులు ఇచ్చినోళ్లకు టికెట్లు ఇచ్చారని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండానే గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్ధిని ఖరారు చేశారని ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గద్వాల జిల్లాలో షాక్ తగిలింది. డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కష్టకాలంలో ఆదుకున్న తమకు గుర్తింపు ఇవ్వకుండా ప్యారాచూట్ నాయకులకు గద్వాల్ టికెట్ కేటాయించారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా డబ్బులు ఇచ్చినోళ్లకు టికెట్లు ఇచ్చారని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని.. కాంగ్రెస్ బలోపేతం కృషి చేసిన నాయకుల జీవితాలను ఆగం చేశారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని.. పాతికేళ్లుగా పార్టీలో వున్నానని ఆయన గుర్తుచేశారు. డీకే అరుణ పార్టీని వీడినా... కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని పనిచేశానని ఆయన వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడిని సంప్రదించకుండానే గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్ధిని ఖరారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నాయకులు పార్టీలో వున్నంత కాలం కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్నారు.