Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉప ఎన్నిక బరిలో గద్దర్.. వివరాలు ఇవే..

తెలంగాణ‌లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హీట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికలో బరిలో నిలిచేందుకు ప్రజాగాయకుడు గద్దర్  సిద్దమయ్యారు. 

Gaddar to contest munugode bypoll from praja shanthi party
Author
First Published Oct 5, 2022, 1:17 PM IST

తెలంగాణ‌లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హీట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికలో బరిలో నిలిచేందుకు ప్రజాగాయకుడు గద్దర్  సిద్దమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో ఆయన కేఏ పాల్‌‌కు చెందిన ప్రజా శాంతి పార్టీ నుంచి బరిలో నిలవనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా కేఏ పాల్ అమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 2న తాము నిర్వహించ తలపెట్టిన ప్రపంచ శాంతి ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాల్ అమరణ దీక్షకు దిగారు.

అయితే నేడు కేఏ పాల్‌ను కలిసిన గద్దర్.. ఆయనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అలాగే ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారు. ఆ పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలవనున్నట్టుగా చెప్పారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా శాంతి పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలవనున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు గద్దర్‌కు 100 కోట్లు ఆఫర్ ఇచ్చి, ఎంపీ టికెట్ కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారని ఆరోపించారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్ షాలు కూడా ఆఫర్స్ ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్ అన్ని రకాల ఆఫర్‌‌లు ఇచ్చారని.. అయితే బడుగు, బలహీన వర్గాల పార్టీ అయిన ప్రజా శాంతి తరఫున మార్పు తీసుకురావడానికి గద్దర్ ముందుకు వచ్చారని తెలిపారు. కేసీఆర్‌ను చిత్తుగా ఓడించడానికి ముందుకు వచ్చిన గద్దర్‌కు ఆహ్వానం తెలుపుతున్నామని చెప్పారు. 

అయితే గద్దర్ కొద్ది రోజులుగా అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారు. పలు పార్టీల సభలకు, కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన ప్రజా శాంతి పార్టీలో చేరి.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. 

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి  కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేయగా.. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు. టీఆర్ఎస్ బుధవారం రోజున ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన వీఆర్ఏ‌లు కూడా మునుగోడు ఉప ఎన్నికలో మూకుమ్మ‌డి నామినేష‌న్లు వేయాలని చూస్తున్నారు. 

ఇక, ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios