సిద్దిపేట: హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొని సిరిసిల్లకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలోని సిద్దిపేటలో  హరీష్ రావు‌ను కలిశారు. ఇద్దరూ మంత్రులు కొద్దిసేపు ఆప్యాయంగా  పలకరించుకొన్నారు. బావ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని హరీష్‌తో కేటీఆర్ అన్నారు.

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  పోలింగ్ సరళిని తెలుసుకొంటూ హరీష్ రావు  అన్ని గ్రామాలు తిరుగుతున్న సమయంలో  గుర్రాలగొంది గ్రామం వద్ద మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఎదురొచ్చింది. మంత్రుల కాన్వాయ్ లు ఎదురెదురుగా వచ్చాయి.  

దీంతో కొద్దిసేపు  మాట్లాడుకొన్నారు. బావ కంగ్రాట్స్  నీకు లక్ష మెజారిటీ ఖాయం అంటూ హరీష్‌రావును ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు నీకు వచ్చే మెజారిటీలో కనీసం సగం మెజారిటీ అన్న తెచ్చుకొంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పోతున్నానను.. మీ వాళ్లంతా అక్కడ నీ కోసం ఎదురుచూస్తున్నారని హరీష్ రావుతో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ మాటలు అనగానే  హరీష్ రావు నవ్వుతూ ఆప్యాయంగా  కేటీఆర్ ను హత్తుకొన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణను విన్న కార్యకర్తలు  నవ్వారు. హరీష్ రావు వెంట ఉన్న కార్యకర్తలతో కేటీఆర్ కరచాలనం చేసి సిరిసిల్లకు వెళ్లారు.

"