హైదరాబాద్: ఏడుగురు చిన్నారులు నీటి గుంటల్లో పడి మృతి చెందారు. బుధవారం నాడు హైద్రాబాద్‌లో జరిగిన ఘటనలో నలుగురు,  నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

హైద్రాబాద్‌కు సమీపంలోని పటాన్‌చెరువులోని రుద్రారం వద్ద ఉన్న నీటి గుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరి వయస్సు 10 నుండి 17 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకొంది. మృతులంతా బంధువులే.

అల్వాల్‌ నుండి ఆరుగురు చిన్నారులు రుద్రారంలోని తమ తాత ఇంటికి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తమ ఇంటికి సమీపంలోని క్వారీ గుంతలో ఆడుకొనేందుకు వెళ్లారు.

రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఈ నీటి గుంటలో కొద్దిగా నీరు ఎక్కువగా ఉంది. గోవర్ధన్, విష్ణువర్ధన్, ఆనంద్, నందినిలు క్వారీ గుంతలో నీటిలో బుధవారం సాయంత్రం ఆడుకొంటుూ నీటిలో మునిగి చనిపోయారు.

ఇదిలా ఉంటే నీటి గుంత ఒడ్డున ఇద్దరు పిల్లలు వెంటనే తమ తాత ఇంటికి చేరుకొని విషయాన్ని చెప్పారు. క్వారీ గుంత వద్దకు వచ్చేసరికి నలుగురు మృతి చెందారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని నంది వడ్డేమాన్ గ్రామంలో  ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. శైలజ, అనిల్, స్వాతిలు చేపలు పట్టేందుకు సూర్యట్యాంక్‌లోకి  వెళ్లి మునిగి చనిపోయారు. గణేష్ అనే విద్యార్ధిని వెంకటయ్య అనే గ్రామస్థుడు రక్షించారు.