హైదరాబాద్: ఈ నెల 12వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం  అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు..

మంగళవారం నాడు ఎన్టీఆర్‌ మార్గ్ లో ఇంటిగ్రేటేడ్ కంట్రోల్ రూమ్ లో జీహెచ్‌ఎంసీ, పోలీస్, రోడ్లు,భవనాలు, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, ఫైర్, హెల్త్ శాఖలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల పరిధిలో  నిమజ్జనం చివరి రోజైన 12 వ తేదీన అన్ని స్థాయిలలో 27,955 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. 

అదేవిధంగా 115 ప్రాంతాల్లో 30 లక్షల వాటర్ ప్యాకెట్స్ ను పంపిణీకి అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు నిమజ్జనం జరిగినవి కాకుండా మిగిలిన సుమారు 11 వేల విగ్రహాలు 12 వ తేదీన  నిమజ్జనం కోసం రానున్నాయని, ఈ విగ్రహల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన. వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా జీహెచ్ ఎంసీ అదనపు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. నిమజ్జనం కోసం 354 క్రేన్ లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నిమజ్జనాన్ని పురస్కరించుకొని 15 బొట్లు, 50 మంది స్విమ్మర్లు అందుబాటులో ఉంటారన్నారు.. 15 మెడికల్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు 7 అంబులెన్స్ లు అందుబాటులో ఉండేలా హెల్త్ అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ముష్రాఫ్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, వాటర్ వర్క్స్ డీఓపీ కృష్ణ, డీఎంసీ  గీతారాధిక, ట్రాఫిక్ ఏసీపీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.