ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కోనేరు కృష్ణ కుటుంబసభ్యులు తనను ఏం చేస్తారోనని భయంగా ఉందని ఫారెస్ట్ ఆఫీసర్ అనిత అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ మండలం సార్సాలో  మొక్కలు నాటేందుకు ట్రాక్టర్లతో చదును చేస్తున్న సమయంలో  కొమరం భీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణ తన అనుచరులతో కలిసి  ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఫారెస్ట్ మహిళా అధికారి అనిత తీవ్రగాయాలపాలయ్యారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె... మీడియాతో మాట్లాడారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కోనేరు కుటుంబసభ్యులు తనను బెదిరించారని ఆమె తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నన్ను ఏం చేస్తారోనని భయం వేస్తోందని ఆమె అన్నారు. మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోయారు. మీడియాతో మాట్లాడుతనూనే అనిత కన్నీరు పెట్టుకున్నారు. తనతోపాటు తన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని కోరారు. యూనిఫాం ని నమ్ముకునే తాను ఆ ఉద్యోగంలోకి వచ్చినట్లు చెప్పారు.