ఓ యువకుడి ప్రేమ... ఇద్దరు స్నేహితుల మధ్య వివాదానికి దారి తీసింది. ఆ వివాదం ఎక్కడకు దారి తీసిందంటే.. ఏకంగా.. ప్రాణాల మీదకు తెచ్చింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే పరిస్థితికి దారి తీసింది. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని నేలటూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేలటూరుకు చెందిన యరజాని అంకమ్మరావు(20) బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయమై అతని మిత్రులతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అదే గ్రామానికి చెందిన మధు, మరో ఇద్దరు యువకులకు మద్యం తాగేందుకు అంకమ్మరావును ఆదివారం రాత్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లారు. 

అక్కడ కూడా ఈ ప్రేమ విషయంలోనే వివాదం చోటుచేసుకుంది. మిత్రులంతా కలిసి అంకమ్మరావుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ వేడి తట్టుకోలేక అంకమ్మరావు రోడ్డుపైకి పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల పోలీసులు తెలిపారు.