తెలంగాణ భవన్ లో అతిథులు, ఉద్యోగుల కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిప‌ల్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ అశోక్ కుమార్ తెలిపారు. అందుకోసమే డిల్లీలోని తెలంగాణ భవన్ ఫ్రీ వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల్లో పని వేగం పెరగడంతో పాటు అతిథులకు సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు.   

ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధులు రామ‌చంద్రు తెజావ‌త్, ఎం కే స‌హానిలతో పాటు అశోక్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నట్లు వెల్లడించారు. 

ముఖ్యంగా తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ అధికారిక కార్యకలాపాలను, సమాచార మార్పిడి సులభతరంగ చేసుకునేందుకు ఈ వైఫై సేవలు ఉపయుక్తంగా నిలుస్తాయని వివరించారు. అత్యంత ప్రమాణాలతో కూడిన ఇంటర్నెట్ సేవలు భవన్ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సాధారణ ఇంటర్నెట్ కన్నా వైఫై నెట్ స్పీడ్ వందరెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.

బ‌తుక‌మ్మ‌, తెలంగాణ ఆవిర్భావ కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్ర సంస్కృతి, రాష్ట్ర ఏర్పాటుపై  విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నామని అన్నారు. మిగతా రాష్ట్రాల భ‌వ‌న్ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా తెలంగాణ భ‌వ‌న్ అన్ని కార్యక్రమాలను కొన‌సాగిస్తున్నట్లు అశోక్ కుమార్ పేర్కోన్నారు.

ఈ కార్యక్రమంలో భవన్ ఆడిషనల్ రెసిడెంట్ కమీషనర్ వేదాంతం గిరి,డిప్యూటీ కమిషనర్ రామ్మోహన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్. రవీంద్ర నాయక్, పూర్ణచందర్ రావు, జోషి ప్రహ్లాద్, నీలకంఠ, జోషిబాబు, జీవన్ బానోతు, రోహన్, రమాకాంత్, మహిళా ఉద్యోగులు, సంగీత, పద్మావతి, శ్యామల, రేఖారెడ్డి, పావని, అనూష, అంబాళిక ఉపాధ్యాయ్, తదితరులు పాల్గోన్నారు.