జయశంకర్ భూపాలపల్లి సింగరేణి గనిలో పేలుడు: నలుగురు కార్మికులకు గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం నాడు సింగరేణి గనిలో పేలుడు చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు.
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం నాడు సింగరేణి గనిలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సింగరేణి కార్మికులను ఆసుపత్రికి తరలించారు.కోల్ కట్టర్ మిస్ ఫైర్ తో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు.బసవరాజుపల్లి కేటీకే సింగరేణి గనిలో ఈ ఘటన జరిగింది.
సింగరేణిలో గతంలో కూడా పలు ఘటనలుచోటు చేసుకున్నాయి. బొగ్గు వెలికి తీసే క్రమంలో పలువురు కార్మికులు గాయాలపాలు కావడంతో పాటు మరణించిన ఘటనలు కూడా జరిగాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా సింగరేణి కార్మికులు విదులు నిర్వహిస్తుంటారు.పెద్దపల్లి జిల్లాలోని సింగరేణిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన 2020 జూన్ 2న జరిగింది.
2021 నవంబర్ 10న మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో రూఫ్ టాప్ కూలడంతో దీని కింద చిక్కుకున్న కార్మికులు మరణించారు. ఇదే సింగరేణి గనిలో 2021 ఏప్రిల్ లో ఇదే తరహాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు.
రామగుండం అండర గ్రౌండ్ సింగరేణిగనిలో 2020 అక్టోబర్ లో జరిగిన ప్రమాదంలో నవీన్ అనే కార్మికుడు మరణించారు. 2020 సెప్టెంబర్ మాసంలో మంచిర్యాలలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. 2020 జూన్ మాసంలో పెద్దపల్లిలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. రాళ్లను పేల్చేందుకు పెట్టిన పేలుడు పదార్ధాలు ప్రమాదవశాత్తు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.