చెల్లి లేచిపోయిందని... నలుగురు అక్కలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. కాగా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నలుగురు యువతులకు స్థానికులు కాపాడారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జడ్చర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ఆరుగురిలో  ఒక్కరికి కూడా వివాహం కాలేదు. పెళ్లి చేసే స్థోమత కూడా వాళ్ల తల్లిదండ్రులకు లేదు. ఈ క్రమంలో ఆ ఆరుగురు అక్కా చెల్లెళ్లల్లో ఐదో అమ్మాయి... వేరే ఒక అబ్బాయితో లేచిపోయింది.

తమకన్నా చిన్నది ఇంటి నుంచి వెళ్లిందని, కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె అక్కలు నలుగురు క్రిమి సంహారక మందు తాగారు. ఈ సమయంలో వారిని అడ్డుకోకుండా అందరిలో చిన్నదైన అమ్మాయిని, తల్లిని గదిలో ఉంచి గడియపెట్టారు. 

తల్లి, చిన్న అమ్మాయి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేయటంతో గ్రామస్థులు నలుగురిని స్థానిక బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.