సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏ జడ్జీలు చేయని సాహసాన్ని నలుగురు జడ్జీలు చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ఈ ఘటన చేసుకుంది. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో దేశంలో న్యాయ వ్యవస్థలో నెలకొన్న చీకటి కోణం బట్టబయలైంది. ఆ వివరాలేంటో కింద చదువుదాం. జడ్జీల ప్రెస్ మీట్ ఫుల్ వీడియో చూసిన తర్వాత న్యూస్ చదవండి.

దేశ న్యాయ చరిత్రలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. తొలిసారి నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి మరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడం దుమారం రేపుతోంది.

సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు తమను ఆవేదనకు గురిచేశాయన్నారు. జరుగుతున్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేసినా.. లాభం లేకుండాపోయిందన్నారు. నలుగురు న్యాయమూర్తులం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి లోపాలను ఎత్తిచూపి సరిచేయాలని కోరినట్లు చెప్పారు. అయినా ఏమాత్రం స్పందన రాలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే తాము మీడియా ముందుకు వచ్చామన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తారా లేదా అన్నది ప్రజలే తేల్చకోవాలని సూచించారు. ఈ మేరకు న్యాయమూర్తులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు.

మీడియా సమావేశంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ..  ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో’’ అన్నారు. సుప్రీం కోర్టులో పరిపాలన విధానం సరిగ్గా లేదన్నారు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయన్నారు. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావని.. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశామన్నారు. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదని బాధతో చెప్పారు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించామని, జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించేందుకు మీ ముందుకు వచ్చామని ఆవేదనతో చెప్పారు. చీఫ్‌ జస్టిస్‌ ను అభిశంసించాలా లేదా అన్నది దేశం తేల్చుకోవాలన్నారు.

మరో న్యాయమూర్తి లోకూర్ మాట్లాడుతూ తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని తెలిపారు. గత డిసెంబర్‌ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా-జస్టిస్‌ చలమేశ్వర్‌ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకన్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.