లిప్ట్ లోనే కొట్టిచంపి... కారులో పడేసి యాక్సిడెంట్ నాటకం... సినీనిర్మాత హత్యకేసులో సంచలన నిజాలు
తెలుగు సినీనిర్మాత సి.అంజిరెడ్డి హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతడిని ఆస్తి కోసమే చంపినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయనను ఆస్తి కోసమే చంపి కారు ప్రమాదంలో చనిపోయినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ నాటకం బయటపడటంతో ఆయనను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే :
తెలుగు సినీ నిర్మాత సి. అంజిరెడ్డికి ముగ్గురు సంతానం. ఓ కొడుకు హైదరాబాద్ లోనే వుంటుండగా మరో కొడుకు, కూతురు అమెరికాలో స్థిరపడ్డారు. అంజిరెడ్డి దంపతులు కూడా తమ శేషజీవితాన్ని అమెరికాలోనే సాగించాలని భావించారు. దీంతో హైదరాబాద్ పద్మారావునగర్ లోని ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో సినీరంగంలో పరిచయం వున్న ఫోటోగ్రాఫర్ రవి ఈ ఇంటికి అమ్మిపెడతానని అంజిరెడ్డికి తెలిపాడు. రెంజిమెంటల్ బజార్ లోని జిఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ఈ ఇంటిని కొనడానికి ఆసక్తి చూపించడంతో అంజిరెడ్డిని అతడికి పరిచయం చేసాడు రవి. అంజిరెడ్డి ఇంటిని చూసిన రాజేష్ డబ్బులు చెల్లించకుండానే దాన్ని సొంతం చేసుకోవాలనే దుర్భుద్ది కలిగింది. ఇందుకోసం అంజిరెడ్డిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు.
ఇంటి కొనుగోలు గురించి మాట్లాడదామని పిలవడంతో గత నెల సెప్టెంబర్ 29న అంజిరెడ్డి జిఆర్ కన్వెన్షన్ కు వెళ్లాడు అంజిరెడ్డి. అప్పటికే రాజేష్ తనవద్ద పనిచేసే బిహారీలను అంజిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు రెడీ చేసాడు. అంజిరెడ్డి రాగానే అతడిని కారులో బంధించిన రాజేష్ మేడ్చల్ వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలంటూ అంజిరెడ్డిపై దాడి చేసారు. ఎంత కొట్టినా అతడు సంతకం చేయకపోవడంతో రాజేష్ గ్యాంగ్ ప్లాన్ మార్చింది.
Read More హైద్రాబాద్‌లో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతిలో కీలక విషయాలు: ఆస్తి కోసం హత్య
తిరిగి అంజిరెడ్డిని రెజిమెంటల్ బజార్ లోని జీఆర్ కన్వెన్షన్ కు తరలించారు. నిర్మాతను కారులోంచి దింపి కన్వెన్షన్ లోకి తీసుకెళ్లేందుకు లిప్ట్ లో ఎక్కించారు. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన రాజేష్ మిగతా ఇద్దరితో కలిసి అంజిరెడ్డిపై మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు లిప్ట్ లోనే చనిపోయినట్లు తెలుస్తోంది.
అంజిరెడ్డి హత్య కేసు నుండి బయటపడేందుకు రాజేష్ మరో నాటకాన్ని ప్రారంభించారు. నిర్మాత కారును సెల్లార్ లోని పిల్లర్ కు ఢీకొట్టించి అందులో మృతదేహాన్ని పడేసారు. ఇలా కారు ప్రమాదంలో అతడు చనిపోయినట్లు చిత్నీకరించే ప్రయత్నం చేసారు. అయితే మరణవార్త తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తండ్రి మృతదేహాన్ని పరిశీలించాడు చరణ్ రెడ్డి. శరీరంపై గాయాలుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో సెప్టెంబర్ 30న గోపాలపురం పోలీసులు అంజిరెడ్డి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సిసి కెమెరాల ఫుటేజీ, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అంజిరెడ్డిది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్దారించారు. లోతుగా విచారణ జరపగా ఆస్తి కోసమే రాజేష్ ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు. అతడితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.