తెలంగాణలోని మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మల్కేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
కొడుకుకి, కూతురికి తొలుత విషమిచ్చి చంపి భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రమేష్, పద్మ దంపతులు తమ కుమారుడు అక్షయ్, సౌమ్యలకు తొలుత విషమిచ్చి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారు ఆత్మహత్య చేసుకున్నారు.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశారు. ఏడు లక్షల రూపాయలకు పైగా అప్పులు కావడంతో వాటిని చెల్లించే తాహతు లేక మరణిస్తున్నట్లు అందులో రాసినట్లు తెలుస్తోంది.
రమేష్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు సౌమ్యకు అతను వివాహం చేసినట్లు తెలుస్తోంది. అయితే, లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
