నిజామాబాద్‌లో బిడ్డ పుట్టక ముందే అమ్మకానికి పెట్టిన తల్లి.. ఆశా వర్కర్ మధ్యవర్థిత్వం.. అలా వెలుగులోకి..
నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళ బిడ్డను పోషించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కడుపులో ఉండగానే అమ్మకానికి పెట్టింది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అమ్మకం విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళ బిడ్డను పోషించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో కడుపులో ఉండగానే అమ్మకానికి పెట్టింది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అమ్మకం విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డను అమ్మే ప్రక్రియలో ఓ ఆశా వర్కర్ పాత్ర కూడా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం నులగురు మహిళలను అరెస్ట్ చేశారు. మహిళల నుంచి రెండు వేల రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ కాలనీలో నివాసముంటున్న గోసంగి దేవి అనే గర్భిణి బిడ్డను కనేందుకు డబ్బులు లేకపోవడంతో పసికందును విక్రయించాలని భావించింది. బిడ్డ కడుపులో ఉండగానే ఆమె సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న కే జయ అనే ఆశా వర్కర్‌ని సంప్రదించింది. దేవిని షబానా బేగం, హుమేరా బేగం అనే ఇద్దరు మహిళలకు జయ పరిచయం చేసింది. దేవి ఈ మహిళల నుంచి రూ.5,000 అడ్వాన్స్‌గా తీసుకుంది. బిడ్డను ప్రసవించిన తర్వాత ఆడపిల్ల అయితే రూ.లక్ష, మగ అయితే రూ.1.5 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చింది.
సెప్టెంబర్ 3న పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవితో ఒప్పందం చేసుకున్న షబానా బేగం.. ఆస్పత్రిలో డెలివరీ చార్జీల కోసం రూ.20 వేలు చెల్లించింది. అయితే ఈ తర్వాత బిడ్డ విక్రయం విషయంలో కొనుగోలు చేసిన ఇద్దరు మహిళల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవకు సంబంధించిన సమాచారం పోలీసులు చేరడంతో.. వారు లోతుగా వివరాలు సేకరించగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.