సారాంశం
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన చిన్నారికి షాక్ కొట్టి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ తెరవబోయిన చిన్నారికి షాక్ కొట్టి మృతి చెందింది. షాక్ తగిలి బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.
నవీపేట్ మండల కేంద్రానికి చెందిన గూడూరు రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి సోమవారం ఉదయం స్థానిక ఎన్ మార్ట్ షాపింగ్ మాల్ కి వెళ్లారు. మాల్‌లో రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా.. రిషిత చాక్లెట్స్ కావాలని ఫ్రిడ్జ్ డోర్ తీయబోయింది. ఈ క్రమంలో ఆ చిన్నారికి కరెంటు షాక్ తగిలింది. షాపింగ్ బిజీలో ఉన్న ఆ తండ్రి ఆ దుర్ఘటనను గమనించకపోవడంతో కొన్ని సెకన్ల పాటు చిన్నారి ఫ్రిడ్జికి వేలాడింది.
కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారిని గమనించిన తండ్రి రాజశేఖర్.. వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకొని మండల కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. కానీ ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు నిర్థారించారు. ఫ్రిడ్జిలో సాంకేతిక లోపం ఉన్నప్పటికీ మాల్ యజమానులు పట్టించుకోకపోవడంతో.. ఫ్రిడ్జికి కరెంట్ సప్లయి అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
కుటుంబ సభ్యుల ఆందోళన
ఇంతటీ విషాదం జరిగిన షాపింగ్ మాల్ యాజమాన్యం మాత్రం తమకేం సంబంధం లేనట్లు వ్యవహరించింది. యథావిధిగా మాల్‌ను తెరిచి నడిపించారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన బాధిత కుటుంబీకులు పోస్ట్టుమార్టం అనంతరం పాప మృతదేహాన్ని మాల్ ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా మద్దతు తెలపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను నచ్చజెప్పారు. మాల్ యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.