హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ తమిళిసైని కోరారు.ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు గవర్నర్ కు అందించారు.

నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆయన ఇంట్లో నుండి  పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్టుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొంది. 

నయీం ఇంట్లో 24 ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పలేదని తెలిపింది. 3 ఏకే 47, 9 పిస్టల్స్ , 7 తపంచాలు, ఒకస్టెన్ గన్, రెండు గ్రైనేడ్స్ స్వాధీనం చేసుకొన్నారని  ఆ సంస్థ ప్రకటించింది. 

అంతే కాదు 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, 6 మ్యాగ్జైన్లు, 612 లైవ్ బుల్లెట్లు, రూ. 2.16 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారని పోలీసులు ప్రకటించిన విషయాన్ని ఫోరం గుడ్ గవర్నెన్స్ సంస్థ గుర్తు చేసింది. 

2 కిలోల బంగారం, రెండున్నర కిలోల వెండి, 21 కార్లు, 26 బైక్స్, 602 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొన్నారని  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది.నయీం ఇంటి నుండి 752 భూపత్రాలు, 130 డైరీలు స్వాధీనం చేసుకొన్న విషయాన్ని ఆ సంస్థ గవర్నర్ కు సమర్పించిన పత్రంలో పేర్కొంది.

ఈ కేసులో పూర్తి వివరాలను చెప్పడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని కోరింది.