సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

1942 మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1966లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన సుభాషణ్ రెడ్డి 1991, నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత 2001 సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం మూడేళ్ల పాటు కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2005 మార్చి 2న రిటైర్ అయిన ఆయనను.. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా ఆయన సేవలందించింది. ఆయనకు ముగ్గురు కుమారులు..

సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అధికార లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.