షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల క్రితం సుజాత భర్త ఆత్మహత్య చేసుకన్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె మృతి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

హైదరాబాదులోని బంజారాహిల్స్ భూవివాదంలో లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్న సజాతను తెలంగాణ అవినితీ నిరోధక శాఖ (ఏసీబి) అధికారులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.14లోని 4,865 చదరపు గజాల స్థలంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదుపై 2020 జూన్ 8న సుజాతను ఏసీబీ అరెస్టు చేసింది. గాంధీనగర్‌లోని సుజాత ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించగా బంగారు ఆభరణాలు, రూ.30 లక్షలు దొరికాయి. అయితే తన ఇంట్లో పట్టుబడిన 30 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో సుజాత విఫలమయ్యారు. 

ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులతో పాటు.. సుజాత భర్త అజయ్‌ను కూడా ఏసీబీ విచారించింది. అయితే సుజాత అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అరెస్టు అయినప్పటీ నుంచి అజయ్ తన సోదరి వద్ద నివసించాడు. భార్య అరెస్ట్ డిప్రెషన్‌లో ఉన్న అతడు, ఏసీబీ అధికారులు అతడిని విచారణకు పిలవడంతో కలవర చెందాడు. ఈ క్రమంలోనే బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, ఏసీబీ కేసు ఉండటంతో సుజాత సస్పెండ్ అయ్యారు. అయితే కొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.