Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్‌తో నల్లాల ఓదెలు దంపతులు భేటీ.. మళ్లీ గులాబీ గూటీకి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు భేటీ అయ్యారు. తన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్‌ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి‌తో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్న ఓదేలు.. కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.

Former MLA Nallala Odelu Meets CM KCR Likely to join pink party
Author
First Published Oct 5, 2022, 9:50 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు భేటీ అయ్యారు. తన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్‌ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి‌తో కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్న ఓదేలు.. కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఓదెలు.. బాల్క సుమన్‌ను ఆత్మీయ అలింగనం చేసుకున్నారు.

ఇక, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన నల్లాల ఓదెలు.. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సమక్షంలో నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే మంచిర్యా జిల్లా కాంగ్రెస్‌ నేతలు మాత్రం నల్లాల ఓదెలు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. చెన్నూరు కాంగ్రెస్‌లో ఆయన చేరిక తర్వాత అంతర్యుద్దం మొదలైందనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్ వర్గం నాయకులతో ఓదెలుకు పడటం లేదు. 

ఈ పరిణామాలను నల్లాల ఓదెలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి ఫలితం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కూడా ఓదెలు.. పార్టీలో తమకు అవమానం జరుగుతుందని ఆరోపించారు. ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్‌లో ఉంటే లాభం లేదని భావించిన ఓదెలు.. మళ్లీ సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓదెలు దంపతులు.. తిరిగి మాజీ బాస్‌ను కలుసుకున్నారు. 

ఓదెలు గురించి.. 2001లో టీఆర్‌ఎస్‌ని ప్రారంభించినప్పటి నుంచి కేసీఆర్‌తో కలిసి ప్రయాణించారు. చెన్నూరు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉధృతంగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసిన.. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో కూడా విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ విప్‌గా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో అప్పటి పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సుమన్ విజయం సాధించారు. 

ఇక, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా.. ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మికి మంచిర్యాల జెడ్పీ చైర్‌ పర్సన్‌గా అవకాశం కల్పించారు. అయితే చెన్నూరు టీఆర్ఎస్‌లో తమ మాట చెల్లుబాటు కావడం లేదని ఆరోపించిన నల్లాల ఓదెలు.. అక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుతో కొంతకాలంగా అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. నల్లాల ఓదెలుతో చర్చలు జరిపారు. ఆయన ఢిల్లీకి తీసుకెళ్లి.. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. 

ఆ సమయంలో నల్లాల ఓదెలు దంపతులు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనలాంటి వారిని విస్మరించారని, బయటి వ్యక్తులు ఆ పార్టీని కైవసం చేసుకున్నారని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారని గుర్తుచేశారు. తన భార్యను జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేసినప్పటికీ.. ప్రజలకు సేవ చేసే అధికారాలు, ప్రోటోకాల్ లేకుండా చేశారని ఆరోపించారు. జెడ్పీ చైర్‌పర్స్‌గా ఉన్న తన భార్యకు  సుమన్ ఏరోజు గౌరవం ఇవ్వలేదని చెప్పారు. సుమన్ అరాచకాల వల్లే టీఆర్ఎస్‌ను వీడినట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios