టీఆర్ఎస్ లో టిక్కెట్ల చిచ్చు: పక్క చూపులు చూస్తున్న అసంతృప్తులు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 7, Sep 2018, 4:01 PM IST
Former mla ks ratnam unhappy for not giving chevella trs ticket
Highlights

టిక్కెట్టు దక్కని అసంతృప్త నేతలు  తమ గళాన్ని విప్పుతున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో తమ రాజకీయ భవితవ్యాన్ని ప్రకటించనున్నట్టు  తేల్చి చెబుతున్నారు

హైదరాబాద్: టిక్కెట్టు దక్కని అసంతృప్త నేతలు  తమ గళాన్ని విప్పుతున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో తమ రాజకీయ భవితవ్యాన్ని ప్రకటించనున్నట్టు  తేల్చి చెబుతున్నారు. చేవేళ్ల టిక్కెట్టు ఆశించిన భంగపడిన కేఎస్ రత్నం ఎల్లుండి తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  మరో వైపు స్పీకర్ మధుసూధనాచారికి మరోసారి టీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించడంతో  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని గండ్ర సత్యనారాయణరావు ప్రకటించారు.

2009 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా  చేవేళ్ల స్థానం నుండి కేఎస్ రత్నం పోటీ చేసి విజయం సాధించారు.  2014 ఎన్నికలకు ముందు  ప్రస్తుత మంత్రి పట్నం మహేందర్ రెడ్దితో కలిసి  కేఎస్ రత్నం  టీఆర్ఎస్ లో చేరారు.  2014 ఎన్నికల్లో రత్నం చేవేళ్ల నుండి  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కాలే యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు.

కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన యాదయ్య ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్ లో చేరారు.  యాదయ్యను  టీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని కేఎస్ రత్నం తీవ్రంగా వ్యతిరేకించాడు.

కానీ, పార్టీ అవసరాల రీత్యా తప్పలేదని పార్టీ నాయకత్వం ఆయనను బుజ్జగించింది.  మరో వైపు  చేవేళ్ల టిక్కెట్టు కోసం  రత్నం  ఎదురుచూశాడు. కానీ, యాదయ్యకే కేసీఆర్ టిక్కెట్టును ఫైనల్ చేశాడు. దీంతో కేఎస్ రత్నం  అసంతృప్తితో ఉన్నాడు.

సెప్టెంబర్ 9వ తేదీన తన అనుచరులతో  సమావేశం కానున్నారు.  టిక్కెట్టు దక్కకపోవడంతో  తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం లేకపోలేదు. యాదయ్యను టీఆర్ఎస్ లో తీసుకురావడంలో మంత్రి మహేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ పరిణామాలు కూడ  రత్నంకు నచ్చలేదు.  ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసుకోవడానికి ఆయన సన్నద్దమయ్యారు. 

ఇదిలా ఉంటే గత ఏడాది చివర్లోనే  టీడీపీ భూపాలపల్లి ఇంచార్జీగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు  టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో  టీడీపీ,బీజేపీ సీట్ల సర్ధుబాటు సందర్భంగా భూపాలపల్లి టిక్కెట్టును బీజేపీ కోరింది.  ఆ సమయంలో  సత్యనారాయణరావు  టీడీపీ నుండి బీజేపీలో చేరి పోటీ చేసి  మధుసూధనాచారిపై ఓటమి పాలయ్యాడు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను సత్యనారాయణరావు గెలిపించుకొన్నారు. కానీ,  గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి టిక్కెట్టును ఆశించారు. కానీ, ఆయనకు టిక్కెట్టు దక్కలేదు.  దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. మరో వైపు ఖానాపూర్ టిక్కెట్టు ఆశించిన  రమేష్ రాథోడ్ కూడ త్వరలోనే తన  భవిష్యత్ కార్యాచారణను వెల్లడించనున్నట్టు ప్రకటించారు.

ఈ వార్తలు చదవండి

 

 

loader