Munugode Bypoll 2022 : టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలూ ఇక్కడ పాగా వేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ అదే స్థానం నుంచి .. బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం మునుగోడు తమ కంచుకోట అని ఈ సారి కూడా ఈ స్తానం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు బరిలో మాజి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిగనున్నారు. సిఎం కేసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20న సంస్దాన్ నారాయణ పూర్ లో జరుగనున్న ప్రజా దీవెన సభలో సిఎం కేసిఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రకటించనున్నారు. కాగా, మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీఅయ్యారు. గురువారం కేబినెట్ సమావేశం కంటే ముందు కొద్దిసేపు అక్కడి నేతలతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మళ్లీ కలుద్దామని నేతలతో చెప్పారు.
ఇదిలా ఉండగా, కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చిట్ చాట్ లో ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం అని అన్నారు. ఆ పార్టీ ఒత్తిడి వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని, మునుగోడు ఎన్నికల్లో మునగడం ఖాయం అని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ తనను అడగలేదని.. అలా అడిగితే ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నట్లు గుత్తా సఖేందర్ రెడ్డి తెలిపారు.
Munugode Bypoll 2022: మునుగోడుపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్.. గులాబీ పార్టీ టికెట్ ఆయనకే..?
ఈ వ్యాఖ్యల మీద రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. అప్పుడే బాగుంటుందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తీవ్ర పరిణామాలు తప్పవని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. పదవుల కోసమో, డబ్బు కోసమో తాను పార్టీ మారలేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలు, కండువాలు మార్చిన చరిత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిదని కోమటిరెడ్డి చురకలు వేశారు.