కల్వకుర్తి: ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం నాడు ఉదయం మరణించాడు. గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుండి ఎడ్మ కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. స్వతంత్ర అభ్యర్ధిగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత  సన్నిహితుడుగా ఎడ్మ కిష్టారెడ్డికి పేరుంది.  జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన వైఎస్ఆర్ కు సన్నిహితుడుగా ఉండేవాడనే అప్పట్లో ప్రచారంలో ఉంది.

1947 మార్చి 22 వ తేదీన ఆయన జన్మించాడు. కల్వకుర్తి పంచాయితీ వార్డు సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్ధానం ప్రారంభమైంది. సర్పంచ్ గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడ ఆయన పనిచేశాడు.తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా కూడ పనిచేశాడు. 2018 జూన్ 10వ తేదీన ఆయన టీఆర్ఎస్ లో చేరాడు. 


ఎడ్మ కిష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం

ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో రైతు కుటుంబంలో  జన్మించారు.  1977 ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. 1986లో టీడీపీ తరఫున కల్వకుర్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 
1994లో స్వతంత్ర్య అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్​ఎస్​లో చేరారు. అనంతరం ఆయన కుమారుడు ఎడ్మ సత్యం కల్వకుర్తి మున్సిపల్​ చైర్మన్​గా ఎన్నికయ్యారు.

వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్​ సరఫరా చేయాలని ట్రాన్స్​ఫార్మర్ల కెపాసిటీ పెంచాలని 2003లో నిరాహారదీక్ష చేపట్టారు. ఊరూరా రైతాంగం పెద్దఎత్తున తరలివచ్చింది. అప్పటి సీఎల్పీ లీడర్​గా ఉన్న డాక్టర్​ వైఎస్​ రాజశేఖర​రెడ్డి స్వయంగా కల్వకుర్తికి వచ్చి ఆయన చేపట్టిన దీక్షను విరమింపజేశారు. అప్పటి నుంచే ఆయనను రైతులు కరెంట్ కిష్టన్నగా పిలుచుకునేవారు.