కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది.  ఖమ్మం జిల్లా నుండి  కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పాలని వనమా వెంకటేశ్వరరావు నిర్ణయం తీసుకొన్నారు.

త్వరలోనే తాను టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని ఆయన తెలిపారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆదివారం నాడు వనమా వెంకటేశ్వరరావు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

 

కాంగ్రెస్ పార్టీతో లభించిన ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతామని ప్రకటించారు. టీఆర్ఎస్‌లో చేరుతామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు.ఎన్నికల సమయంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సీపీఐ పట్టుబట్టింది. కానీ, ఈ స్థానం వదిలిపెట్టేందుకు కాంగ్రెస్ సిద్దపడలేదు.