అడవిలోనే మకాం వేసిన పోలీసులు నర్సాపూర్ చేరకముందే సునీతా లక్ష్మారెడ్డి అరెస్టు అర్హులకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ హరీష్ రావు కార్యక్రమం కోసం పోలీసుల హంగామా

ఆమె తెలంగాణకు చెందిన ఆడబిడ్డ. గతంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆమెను పోలీసులు మాత్రం అడవిలోనే మకాం వేసి అరెస్టు చేశారు. ఆమెను అడవిలోనే ఎందుకు అరెస్టు చేశారో తెలుసా? ఆమె చేసిన నేరమేంటో తెలుసా? ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్రూముల ఇండ్ల పథకానికి సోమవారం శంకుస్థాపన చేశారు. 500 మందికి ఇండ్ల కోసం ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే గతంలో నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సుమారు 1100 మందికి ఇండ్ల జాగాలకు పట్టాలు ఇప్పించింది. తెలంగాణ సర్కారు మాత్రం డబుల్ బెడ్రూముల ఇండ్లిస్తున్నం కదా అని ఆమె ఇప్పించిన 1100 మంది పట్టాలను క్యాన్సల్ చేసింది. కానీ ప్రస్తుతం 500 మందికే డబుల్ బెడ్రుముల ఇండ్ల కోసం శంకుస్థాపన చేసింది. గతంలో సునీతా లక్ష్మారెడ్డి ఇప్పించిన లబ్ధిదారుల్లో నిజమైన అర్హులు కేవలం 450 మంది మాత్రమే ఉన్నారని, వారికి అదే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని సర్కారు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చేత ఈ తతంగం నడిపించారు. 

1100 మందికి ఇచ్చిన పట్టాలు క్యాన్సల్ చేసి అందులో సగం మందికే డబుుల్ ఇండ్లు ఇస్తామనడం పట్ల సునీతా లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా వారికి కూడా న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమెను నర్సాపూర్ రానిస్తే సభలో ఆందోళన చేస్తుందేమోనన్న ఉద్దేశంతో అటవీ ప్రాంతంలోనే పోలీసు బలగాలు క్యాంపు ఏర్పాటు చేశాయి. సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న క్రమంలో ఫారెస్టులోనే ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ఆమెతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. సునితా లక్ష్మారెడ్డిని మాత్రం మనోహరాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు. 

మొత్తానికి తెలంగాణ ఆడబిడ్డను అడవిలోనే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసుల తీరును పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోకి వచ్చిన తర్వాతనైనా అరెస్టు చేయవచ్చు కదా అని వారు అంటున్నారు.