హైదరాబాద్: మాజీ మంత్రి సబితారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఆదివారం నాడు టీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి కూడ సమావేశమయ్యారు.

సీఎల్పీ పదవి దక్కకపోతే  టీఆర్ఎస్‌లో చేరాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకొన్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ సీటు నుండి పోటీ చేయాలని కార్తీక్ రెడ్డి భావించారు. కానీ, ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో  కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆ తర్వాత కుంతియాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సర్దిచెప్పడంతో కార్తీక్ రెడ్డి తన రాజీనామాను ఉప సంహరించుకొన్నారు.

ఈ నెల 9వ తేదీన శంషాబాద్‌లో జరిగిన రాహుల్ సభకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సభ పట్ల కూడ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు సన్నాహలు చేసుకొంటుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు మధ్యవర్తిత్వం వహించారని ప్రచారం సాగుతోంది.ఇవాళ అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి భేటీ అయ్యారని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం నుండి కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఏడాది నవంబర్ మాసంలో  టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి  బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపినట్టుగా  చెబుతున్నారు.