హైదరాబాద్:మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ముఖేష్ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అత్యవసరంగా జూబ్లీహిల్స్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో ముఖేష్ గౌడ్ కు చికిత్స అందిస్తున్నారు.

కొంతకాలంగా ముఖేష్ గౌడ్ అనారోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆదివారం నాడు పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

1989,2004 ఎన్నికల్లో మహారాజ్‌గంజ్ నుండి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009 ఎన్నికల్లో ముఖేష్ గౌడ్ గోషామహల్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖేష్ గౌడ్ కు చోటు దక్కింది.

2009 లో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ముఖేష్ గౌడ్ మంత్రిగా కొనసాగారు. 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుండి పోటీ చేసి ముఖేష్ గౌడ్ ఓటమి పాలయ్యాడు. ఈ రెండు దఫాలు బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్ చేతిలో ముఖేష్ గౌడ్ ఓడిపోయాడు. 1986లో జాంబాగ్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కార్పోరేటర్ గా ముఖేష్ గౌడ్ విజయం సాధించారు.

విద్యార్ధి దశలో ముఖేష్ గౌడ్ ఎన్ఎస్‌యూఐలో పనిచేశాడు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ లో ముఖేష్ గౌడ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలుసుకొన్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆపోలో ఆసుపత్రికి చేరుకొన్నారు.