హైదరాబాద్:  సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని  కేసీఆర్ ను కోరాలని ఉందని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

మంగళవారం నాడు ఆయన జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు.  సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి ఎన్నికలకు ఏడాది ముందు ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తోంది.    తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని భావిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో  సంక్షేమ కార్యక్రమాలను బూచిగా చూపి టీఆర్ఎస్  ఓట్లను దండుకొందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేయడం లేదని కూడ కాంగ్రెస్  బీజేపీలు ఆరోపిస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడ ఈ విషయమై టీఆర్ఎస్ పై విమర్శల దాడికి దిగాయి.