హైదరాబాద్: తన భూములు విక్రయించి నమస్తే తెలంగాణ పత్రికకు డబ్బులు ఇచ్చినట్లు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తాను కేసీఆర్ తోనో, ప్రజలతోనో, మీడియాతోనో ఉన్నానని, కేసీఆర్ తో కలిసి తర్వాత పైసా వ్యాపారం కూడా తాను చేయలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల మసావేశలో చెప్పారు. 

రాష్ట్రంలోని సంస్థల ఆధీనంలో ఉన్న ఆసైన్డ్ భూములను బయటకు ఎందుకు లాగలేదని ఆయన అడిగారు తాను 1980 నుంచి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నానని, పౌల్ట్లీ పరిశ్రమ కిందికి రాదని ఆయన చెప్పారు. 14 ఏళ్ల పాటు తమ్ముడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఒక్కసారిగా దయ్యం ఎలా అయ్యాడని ఆయన అడిగారు. తాను పార్టీ పెడుతానని గానీ పార్టీ మారుతానని గానీ చెప్పలేదని అన్నారు. తనతో ఉన్న అనుబంధమేమిటో కేసీఆర్ కు గుర్తుకు రావాలి కదా అని ఆయన అన్నారు. 

అధికారులు వావివరుసలు లేకుండా నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు. కేసీఆర్ కు కూడా బిడ్డలున్నారని, కుటుంబం ఉందని ఆయన అన్నారు. జమున వైఫ్ ఆఫ్ నితిన్ రెడ్డి అని నివేదికలో రాశారని చూపిస్తూ ఆయన అ వ్యాఖ్యలు చేశారు. 

షెడ్ నిర్మాణం జరిగే సమయంలో లేబర్ షెడ్లు పక్కన వేశారని ఆయన చెప్పారు. తాము భూములను ఆక్రమించుకోలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ కు కూడా రోడ్లు వేశారని ఆయన చెప్పారు. వ్యక్తులుంటారు... పోతారు గానీ ధర్మం అనేది ఉంటుందని ఆయన అన్నారు. ప్రజాగ్రహానికి గురైతే ఆ ఫలితాలు తప్పకుండా ఉంటాయని ఆయన అన్నారు.