జనగామ:తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పదవుల కోసం ఒక్క పైసా తీసుకొన్నట్టుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్ విసిరారు, అంతేకాదు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొంద రాజయ్యపై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జాఫర్‌ఘడ్ మండలంలో కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రాజయ్య పై ఆయన విమర్శలు గుప్పించారు.  

చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. 

పదవులు అమ్ముకుంటున్నారు పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంంలో ఇద్దరు నేతల మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఇటీవల కాలంలో ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకొంటున్నారు. ఒకే పార్టీలో ఉంటున్న ఇద్దరు నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.