హైదరాబాద్: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి హైద్రాబాద్ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షాను దామోదర రాజనర్సింహ కలవనున్నారని సమాచారం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దామోదర రాజనర్సింహ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆంథోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ది, జర్నలిస్ట్ క్రాంతికిరణ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి బాబూమోహన్ చేతిలో ఆయన ఓడిపోయాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మావతి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సాయంత్రమే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 

కొంత కాలంగా మాజీ డిప్యూటీ  సీఎం దామోదర రాజనర్సింహతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టుగా బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.దామోదర రాజనర్సింహ బీజేపీలో చేరాలని కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

శనివారం నాడు హైద్రాబ ాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా శుక్రవారం నాడు రాత్రి హైద్రాబాద్ కు వస్తున్నారు. అయితే ఇవాళ రాత్రే ఆయనను రాజనర్సింహ కలిసే అవకాశం ఉందంటున్నారు.

కానీ, అధికారిక కార్యక్రమంలో ఉన్నందున పార్టీ నేతలకు ఇంకా అపాయింట్ మెంట్ లభ్యం కాలేదని సమాచారం. అయితే ఇవాళే అమిత్ షా ను రాజనర్సింహ కలుస్తారా.. తర్వాత కలుస్లారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం దామోదర రాజనర్సింహ ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది. ఆ పదవి దక్కకపోతే కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉందంటున్నారు. పార్టీ మారే విషయంలో రాజనర్సింహ నుండి ఎలాంటి స్పష్టత రాలేదు.

పార్టీ వీడుతున్నట్టు గానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.దామోదర రాజనర్సింహతో పాటు విజయశాంతి కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని విజయశాంతి ఇటీవలనే  ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే దామోదర రాజనర్సింహతో కూడ బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు.