Asianet News TeluguAsianet News Telugu

Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) కన్నుమూశారు. లో బీపీ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరించారు. అయితే స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆయన కన్నుమూశారు.

Former cm Konijeti rosaiah passed away
Author
Hyderabad, First Published Dec 4, 2021, 8:55 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలుమురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్నారు. రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, టీ అంజయ్య, కె విజయభాస్కర రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి  మత్రివర్గాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

రాష్ట్ర మంత్రిగా.. 
రోశయ్య..1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి సర్కార్​లో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు చేపట్టారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో మళ్లీ కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలను నిర్వర్తించారు. 2004, 2009లో వైఎస్‌ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 16 సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇందులో చివరి ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఇంకా.. 1995-97 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా రోశయ్య పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆ సమయంలోనే కర్ణాటక ఇంచార్జ్ గవర్నర్‌గా రోశయ్య అదనపు బాధ్యతలు చేపట్టారు. 

ఆర్థికమంత్రిగా..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు రోశయ్య ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ రూపకల్పనలో రోశయ్య తనదైన ముద్ర వేసేవారు. అయితే వయోభారంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios