కామారెడ్డి:కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామానికి సమీపంలోని తాటివాని మత్తడివాగు ఒడ్డున చెట్టుతొర్రలో ఉన్న చిరుత పిల్లలను ఫారెస్ట్ అధికారులు జూ పార్క్ కు తరలించారు.

మత్తడి వాగు నుండి ఇసుకను తరలించే వాళ్లు చెట్టు తొర్రలో చిరుతపులి పిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించారు.ఈ విషయాన్ని వెంటనే స్థానిక అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రకాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి చిరుతపులి పిల్లలు ఉన్న చెట్టు వద్దకు చేరుకొన్నారు. వెంటనే గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు.

చిరుతపులి తల్లి ఆహారం కోసం వేటకు వెళ్లి ఉంటుందని అటవీశాఖాధికారులు భావించారు. వేట నుండి వచ్చిన తర్వాత పిల్లలను పులి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. 

చిరుతపులి ఏ క్షణమైనా  వచ్చే అవకాశం ఉన్నందున ఎవరూ కూడ ఇటువైపు రావొద్దని ఆయన సూచించారు. ఆదివారం నాడు సాయంత్రం ఓ చిరుతపులి కూనను అటవీశాఖ అధికారులు జూకు తరలించారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు చిరుతపులిని పట్టుకొనేందుకు అటవీశాఖాధికారులు గస్తీ తిరుగుతున్నారు.