Asianet News TeluguAsianet News Telugu

ఆదివాసీ మహిళపై అమానుష చర్య.. దుస్తులు విప్పేసి కొట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి  మండలంలో (Mulkalapalli Mandal) ఆదివాసీ మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

forest beat officer Stripping of Tribal Woman in Bhadradri-Kothagudem district minister orders probe
Author
Hyderabad, First Published Jan 22, 2022, 3:29 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి  మండలంలో (Mulkalapalli Mandal) ఆదివాసీ మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా  ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) స్పందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్​కు మంత్రి ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించామని చెప్పారు. అయినప్పటికీ కొందరు అధికారులు ఇలాంటి చర్యల పాల్పడుతున్నారని.. తప్పుగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని ఆమె స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సూచించారు.

అసలేం జరిగిందంటే.. 
ములకలపల్లి మండలంలో సాకివాగుకు చెందిన నలుగురు ఆదివాసీ మహిళలు (tribal women) గురువారం మధ్యాహ్నం కట్టెల కోసం అడవికి వెళ్లారు. పొయ్యిలో వాడే కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన వారిని.. ఫారెస్ట్ బీట్ అధికారి మహేశ్ అడ్డుకున్నాడు. అడవిలో ఎందుకొచ్చారంటూ వారితో దురుసుగా ప్రవర్తించాడు. వారిలో ఒకరిని మహేశ్ కొట్టినట్టుగా మహిళలు తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారి తన బట్టలు లాగి, వివస్త్రను చేసి కొట్టాడని తెలిపారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడినట్టుగా పేర్కొన్నారు.

అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం గ్రామానికి వెళ్లిన నాయకులతో మహిళలు జరిగిన విషయం చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆదివాసీ మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన మహేష్‌పై పలు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ ఘటనకు సంబంధించి బాధిత ఆదివాసీ మహిళలు ముల్కలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఫారెస్ట్ అధికారి మహేష్ తోసిపుచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios