Eatala Rajender: రాష్ట్రంలో సంభ‌వించిన వరదల వెనుక విదేశీ హ‌స్తం ఉంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర మాజీమంత్రి, బీజేపీ నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Telangana floods: రాష్ట్రంలో గ‌త‌వారం నుంచి ఎడ‌తెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఇప్ప‌టికీ ముంపు ప్రాంతాల్లో ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయి. అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. వ‌ర‌ద‌ల ప్ర‌భావంతో తీవ్రంగా దెబ్బ‌తిన్న భ‌ద్ర‌చలం స‌హా గోదావ‌రి ప‌రివాహక ప్రాంతాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. ఆనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వరదల వెనుక విదేశీ హస్తం ఉంద‌ని చెప్ప‌డంతో రాజ‌కీయ దుమారం మొద‌లైంది. సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్, భార‌తీయ జ‌నతా పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగించారు.

 తెలంగాణలో ఇటీవల సంభవించిన వరదల వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ఆయ‌న స్పృహ కోల్పోయి ఈ వ్యాఖ్య‌లు చేశారంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎంకు సూచించారు. ఇటీవల వచ్చిన వరదల వెనుక విదేశీ కుట్ర ఎలా ఉంటుందని సీఎంను ప్రశ్నించారు. కరువు నివారణకు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో క్లౌడ్ సీడింగ్ వంటి పథకాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని సీఎంకు గుర్తు చేశారు.

గిరిజన మహిళా నాయకురాలు ద్రౌపది ముర్మును బీజేపీ ప్రభుత్వం రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రంగంలోకి దించడంపై వ్యాఖ్యానించిన ఈటల, గిరిజన మహిళా నేత దేశానికి రాష్ట్రపతి కాబోతున్నారని, గిరిజన అధ్యక్షుడిగా ముర్ము నియామకం దేశప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తదుపరి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గిరిజనులకు 9 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఎన్డీయేతర పార్టీలు కూడా ముర్ముకు మద్దతు పలుకుతున్నాయని, ఇప్పటికైనా గిరిజనులు తమ పట్ల కేసీఆర్ వైఖరిని అర్థం చేసుకోవాలని కోరారు.

కాగా, అంత‌కుముందు రాష్ట్రంలో సంభ‌వించిన వ‌ర‌ద‌ల గురించి మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు. గతంలో కాశ్మీర్ లోని లడ్డాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ప్రస్తుతం గోదావరిపై క్లోడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. దీని వెనుక వీదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజ‌య్ మండిప‌డ్డారు. గోదావ‌రి వరదల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. Cloud Burst పేరుతో విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.తెలంగాణలో భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమదన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే సీఎంకు మతి భ్రమించినట్లుందనిపిస్తుందన్నారు.