రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్... 78 మంది విద్యార్థినులకు అస్వస్థత..
సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కావడంతో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.

నిజామాబాద్ : తెలంగాణరాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్ లోని ఓ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 78 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. వీరంతా రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి మంగళవారం తెలిపారు.
జిల్లాలోని భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో సోమవారం రాత్రి భోజనాలు చేసిన తరువాత.. వాంతులు, కడుపునొప్పితో పలువురు విద్యార్థినులు బాధపడ్డారు. ఈ విద్యార్థినులంతా ఫుడ్ పాయిజన్ జరినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
వెంటనే కేజీబీవీ సిబ్బంది మొత్తం 78 మంది విద్యార్థులను భీమ్‌గల్, నిజామాబాద్‌లోని ఆసుపత్రులలో చేర్పించారు. అయితే, ఇది తేలికపాటి ఫుడ్ పాయిజనింగ్ కేసు అని అధికారి తెలిపారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స పొందుతున్నారని అధికారి తెలిపారు.