Asianet News TeluguAsianet News Telugu

డీఎస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్: అనుచరులతో మంతనాలు

భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో డీఎస్ సమావేశం

follower meets with DS in NIzambad

నిజామాబాద్: టీఆర్ఎస్ నేత, ఎంపీ డి. శ్రీనివాస్ తన అనుచరులతో సమావేశమౌతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బుధవారం నాడు లేఖ రాశారు. ఈ లేఖను మీడియాతో విడుదల చేశారు. దీంతో  డీఎస్‌తో ఆయన అనుచరులు సమావేశమయ్యారు.

కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు  డీఎస్ దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై డి. శ్రీనివాస్  అసంతృప్తిగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  బుధవారం నాడు నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలో టీఆర్ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో డీఎస్ తీరుపై  పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు  ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డీఎస్ ప్రయత్నాలు చేస్తున్నారని  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

ఈ తరుణంలోనే బుధవారం నాడు ఉదయమే ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకొన్నారు డి.శ్రీనివాస్. అయితే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎస్ హైద్రాబాద్ నుండి నేరుగా నిజామాబాద్ కు చేరుకొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని తన అనుచరులతో డీఎస్ బుధవారం ఉదయం నుండి సమావేశాలు నిర్వహిస్తున్నారు.టీఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్న వ్యూహలను జాగ్రత్తగా  గమనిస్తున్నారు.  రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై డీఎస్ అనుచరులతో చర్చిస్తున్నారు. ఏ రకంగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలనే దానిపై కూడ చర్చిస్తున్నట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ అపాయింట్ కోసం డీఎస్ కోరినట్టు సమాచారం. అయితే సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. రెండు మూడు రోజుల తర్వాత అపాయింట్ మెంట్ ఇవ్వనున్నట్టు సంప్రదించాలని సీఎంఓ నుండి డీఎస్ కు సమాచారం వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అపాయింట్ మెంట్ లభించకపోవడం టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంపై డీఎస్ అనుచరులతో చర్చిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios