హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్వయంకృతాపరాధం వల్లే  రాష్ట్రంలో బీజేపీకి ఆశవాహ పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఈ ఏడాది పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. బీజేపీ మాత్రం నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.

బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడంలో  కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో  బీజేపీ అభ్యర్థుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ నేతలు కీలకంగా పనిచేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల ఫలితాలకు ముందే ఈ నివేదికను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఈ రెండు నియోజకవర్గాల నుండి ఈ నివేదికలు అందాయి.  అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు.

టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలంటే  ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక అభ్యర్థులను ఓడించేందుకు క్షేత్రస్థాయిలో  కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహకరించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. నిజామాబాద్  ఎంపీ స్థానం నుండి 2004, 2009 ఎన్నికల్లో మధు యాష్కీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఈ స్థానం కంటే భువనగిరి స్థానం నుండి పోటీ చేయాలని ఆసక్తి చూపారు. కానీ, పార్టీ నాయకత్వం కారణంగా ఆయన నిజామాబాద్ నుండి పోటీ చేశారు.

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి  యాష్కీ పెద్దగా ప్రచారం కూడ నిర్వహించలేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్  బీజేపీకి అనుకూలంగా పనిచేసిందనే విమర్శలు కూడ ఉన్నాయి. మరో వైపు బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ తనయుడు. ఇది కూడ బీజేపీకి కలిసి వచ్చింది.

ఇక కరీంనగర్ నియోజకవర్గంలో కూడ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే విమర్శలు లేకపోలేదు  స్థానికంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బీజేపీకి కొందరు కాంగ్రెస్ నేతలు స్థానికంగా పనిచేసి ఉండొచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  చెబుతోంది.

ఆదిలాబాద్‌ ఎంపీ స్థానంలో ఆదీవాసీల ప్రభావం తీవ్రంగా కన్పించింది. ఈ ప్రభావంతోనే బీజేపీ అభ్యర్ధి ఈ స్థానంలో విజయం సాధించారని అభిప్రాయాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో  బాపురావు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కానీ ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు

కాంగ్రెస్ కంటే బీజేపీ ఒక్క స్థానాన్ని అధికంగా గెలుచుకొంది. బీజేపీ నాలుగు ఎంపీలను గెలుచుకోవడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై మరింత కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలపై ఈ దఫా కేంద్రీకరించి బీజేపీ నాయకత్వం పనిచేయనుంది.

కాంగ్రెస్ పార్టీ మరిన్ని స్థానాలను గెలుచుకొంటే ఆ పార్టీ క్యాడర్‌లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని  బీజేపీ నేతలు చెప్పడానికి ఈ ఎంపీ ఫలితాలు కూడ కారణంగా కమలదళం చెబుతోంది.

ఇదే అదనుగా బీజేపీ నేతలు ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ వైపుకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్,  టీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిణామాలకు పరోక్షంగా కాంగ్రెస్  కారణమైంది.

పార్టీ నాయకత్వంపై అదే పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు విమర్శలు చేయడం కూడ గందరగోళానికి కారణంగా మారింది. మరో వైపు బీజేపీనే తెలంగాణలో  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ  కాంగ్రెస్ నేతలు కూడ  చెప్పడం కొంత వివాదాస్పదంగా మారింది.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని... మరికొన్ని సీట్లలో రెండో స్థానంలో నిలిస్తే పరిస్థితి మరో రకంగా ఉండేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.