హైదరాబాద్: తెలంగాణలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఒడిశా నుంచి తెప్పించే ప్రయత్నాలు జరగుతున్నాయి. విమానాల్లో ఆక్సిజన్ ను తెప్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు విమానాలు బయలుదేరాయి.

బేగంపేట నుంచి విమానాలను ఒడిశాకు పంపించే ఏర్పాట్లను ఈటెల రాజేందర్, సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో త్వరగా తెప్పించడానికి విమానాలను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో తెప్పిస్తే మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. విమానాల్లో త్వరగా చేరుకుంటాయి. 

ఒడిశా నుంచి ఆక్సిజన్ తెప్పించడానికి కృషి చేస్తున్న ఈటెల రాజేందర్ ను, సోమేష్ కుమార్ ను మంత్రి కేటీ రామారావు అభినందించారు. ట్విట్టర్ వేదికగా వారిని అభినందించారు. ఆక్సిజన్ ను తేవడానికి తెలంగాణ యుద్ధ విమానాల సహాయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు ఆక్సిజన్ తేవడానికి యుద్ధ విమానాల్లో ఖాళీ ట్యాంకులను పంపే ఏర్పాట్లను ఈటెల రాజేందర్, సోమేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

 

తెలంగాణకు త్వరిత గతిన ఆక్సిజన్ తెప్పించడానికి యుద్ధ విమానాల ద్వారా ఖాళీ ట్యాంకర్లను పంపుతున్న సోమేష్ కుమార్ ను, ఈటెల రాజేందర్ అభినందనీయులని ఆయన అన్నారు. దాని వల్ల ఆక్సిజన్ తెప్పించడంలో మూడు రోజులు ఆదా అవుతాయని ఆయన చెప్పారు. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలను వాడడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. 

తన ట్వీట్లకు యుద్ధవిమానాల్లో ఖాళీ ట్యాంకులను పంపుతున్న సోమేష్ కుమార్, ఈటెల రాజేందర్ ఫోటోలను ఆయన జత చేశారు.