పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు భగ్గుమంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకే చెందిన మరో నాయకుని అనుచరులు తొలగించడం వివాదానికి కారణమైంది. 

పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్‌లో వర్గ పోరు భగ్గుమంది. ముఖ్యంగా స్థానిక నాయకుల ఫ్లెక్సీలను మరో వర్గానికి చెందిన నాయకుని అనుచరులు తొలగించడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు తొలగించడం వివాదానికి కారణమైంది. 

వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ భవన ప్రారంభంతో పాటు దాడాపు లక్షమందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీని దృష్ట్యా టిఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి పట్టణాన్ని గులాబీమయం చేశాయి. ఈ క్రమంలో నల్ల మనోహర్ రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను పెద్దపల్లి ఎమ్మెల్యే వర్గీయులు తొలగించి ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెట్టడంతో నల్ల వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు తనపై కక్ష గట్టి ఫ్లెక్సీలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కుటుంబంలో ఉండి ఇలాంటి పనులు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. దీనిపై టిఆర్ఎస్ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు.