జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. దీంతో భూపాలపల్లి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. దీంతో భూపాలపల్లి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు కారణం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటన, మరోవైపు నేడు భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండటమే. ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో.. కొద్ది రోజుల క్రితమే భూపాల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక, నేడు భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో.. అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు పార్టీలకు చెందిన నేతలను చెదరగొట్టారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించి.. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంటరమణారెడ్డి తన అనుచరులను ఉసిగొల్పి పోలీసు వ్యవస్థ అండతో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్టుగానే కనిపిస్తున్నప్పటికీ.. ఎప్పుడూ ఏం జరుగుతుందోననే ఆందోళన మాత్రం నెలకొంది.
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర సోమవారం రాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లికి చేరుకుంది. రాత్రి అక్కడే బస చేసిన రేవంత్ రెడ్డి.. మంగళవారం కేటీకే 5 ఆవరణలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం కాశీంపల్లిలోనే ప్రజాసంఘాలు, మహిళా సంఘాలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కాశీంపల్లి నుంచి యాత్రను ప్రారంభించి.. సాయంత్రానికి భూపాలపల్లిలోని అంబేడ్కర్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించనున్నారు.
