దుబ్బాక: చాలా మందికి విక్టరీ వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమా గుర్తుండే ఉంటుంది. హీరో వెంకటేష్, ఖుష్బూ ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వెంకేటేష్ తన మిత్రులతో కలిసి కలియుగ పాండవులుగా మారి, సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారి మీద పోరాటం చేస్తాడు. 

కలియుగ పాండవులు పేరుతో ఐదుగురు యువకులు దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలి రోజు ఆరుగురు యువకులు నామినేషన్లు వేశారు. వారిలో ఐదుగురు కలియుగ పాండవులు పేరు మీద నామినేషన్లు వేశారు 

వేములవాడకు చెందిన బుర్ర రవితేజ గౌడ్, ఉప్పల్ కు చెందిన రేవు చిన్న ధనరాజ్, కరీంనగర్ కు చెందిన కె. శ్యామ్ కుమార్, ధర్మపురికి చెందిన మోతె నరేష్, చొప్పదండికి చెందిన మీసాల రాధాసాగర్ నామినేషన్లు వేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పూర్తి స్థాయిలో సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆ యువకులు వెల్లడించారు 

దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉంది. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు 19వ తేదీ. నవంబర్ 3వ తేదీన పోలీంగ్ జరుగుతుంది. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

అధికార టీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాత, బిజెపి తరుఫున రఘునందన్ రావు, కాంగ్రెసు తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు.