ఇబ్రహీంపట్నంలో ఐదేళ్ల చిన్నారిని ఓ స్కూలుబస్సు చిదిమేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి అంతలోనే అనంత లోకాలకు చేరుకుంది. మృత్యువు బస్సు రూపంలో వచ్చి ఆ చిన్నారిని చిదిమేసింది. ఇబ్రహీంపట్నం రూరల్ లో ఈ ఘటన తీవ్రవిషాదాన్ని నింపింది. సీఐ రవికుమార్ ఈ ఘటనకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
విజయలక్ష్మి, వేణుగోపాల్ దంపతులు బాలాపూర్ మండలం కుర్మల్ గూడలోని రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. హితిషా, భావన, భానుప్రసాద్ లు మల్లాపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. భావన యూకేజీ చదువుతోంది. రోజులాగే సోమవారం ఉదయం స్కూలుకు వెళ్లిన పిల్లలు సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చారు.
హైద్రాబాద్ దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఏడుగురికి గాయాలు
అదే సమయంలో భావన ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఇంటిముందు ఆడుకుంటుంది. బాలాపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు (టీఎస్ 07యుజీ 3293) డ్రైవర్ ఆ చిన్నారిని చూసుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. దీంతో బస్సు వేగంగా వచ్చి భావనను ఢీ కొట్టింది.
ఢీ కొట్టి మళ్ళీ పాప తల మీద నుంచి వెళ్ళిపోవడంతో… పాపతల చిరిగిపోయి మెదడు బయటికి వచ్చింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా క్షణాల్లో జరిపోయింది. అక్కడే ఉండి గమనిస్తున్న వారు.. పరిగెత్తుకుని వచ్చేసరికి పాప అందరాని లోకాలకు వెళ్ళిపోయింది.
ఆడుకుంటానని బయటికి వచ్చిన చిన్నారి అంతలోనే మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బస్సు అక్కడి నుంచి వెళ్లకుండా ఆపేశారు. డ్రైవర్ ని పారిపోకుండా పట్టుకున్నారు. బస్సుముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు పోలీసులు సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాప మృతి మీద తల్లి మాట్లాడుతూ.. తన కూతురు బయట ఆడుకుంటానని వచ్చిందని.. అంతలోనే గట్టిగా కేకలు వినిపించడంతో బైటికి వచ్చి చూశానని చెప్పారు. అప్పటికే పాపను ఢీ కొట్టిన బస్సు.. మళ్లీ వెనక్కి వెళ్లి తిరిగి వచ్చి.. పాప తలమీదినుంచి పోయిందని.. తల ఫట్ మని పగిలిన శబ్దం విన్నానంటూ హృదయవిదారకంగా రోధిస్తూ చెప్పింది.
