నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుభ కార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. కారు అతి వేగంగా దూసుకుని వచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. రోడ్డు పక్కకు ఒరిగిన ఆటోపై కారు పల్టీ కొట్టింది. 

మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం టానాకలాన్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

జాన్నంపేట్ గ్రామ సర్పంచ్ పొత్తళ్ల సాయిలు పుట్టు వెంట్రుకల కార్యక్రమం ఆదివారం కుర్నాపల్లి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన బాలమణి (60), గంగామణి (55), చక్కలి సాయిలు (65) కల్యాపూర్ సాయిలు (65) ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

ప్రమాదంలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించారు. ఆటో డ్రైవర్ నయీం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బాలమణి, గంగామణి అక్కాచెల్లెళ్లు. 

ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడవల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ చెప్పారు.